కాంట్రాక్టు వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని భువనగిరి ఎంపీ..

 హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు సహా ఇతర కాంట్రాక్టు వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి విజిలెన్స్ అదనపు డీజీకి లేఖ రాశారు. క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియపై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది అసోసియేషన్ పనితీరును ప్రభావితం చేస్తోందన్నారు.అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాధికారాలు కొంతమంది(అధ్యక్ష, సెక్రటరీ) వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. టెండర్ లేకుండా ఐపీఎల్‌ కాంట్రాక్టులు ఇవ్వడం వంటి నిర్ణయాలు హెచ్‌సీఏ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయన్నారు. హెచ్‌సీఏలో న్యాయబద్ధత, జవాబుదారీతనాన్ని నిర్ధరించేందుకు అన్ని టెండర్లలో సరైన ప్రక్రియను అనుసరించడం చాలా అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఆదాయం, వ్యయానికి సంబంధించిన పారదర్శకత లేకపోవడం బాధాకరమన్నారు. దీంతోపాటు మ్యాచ్‌ల సమయంలో రద్దీని క్రమబద్ధీకరించేందుకు, భద్రతను మెరుగుపరచడానికి ఉప్పల్ స్టేడియంలో మల్టీలెవల్ పార్కింగ్ అవసరమన్నారు. ఈ విషయాలపై విచారణ ప్రారంభించి, హెచ్‌సీఏ సమగ్రతను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.

Join WhatsApp

Join Now