మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ రాజీనామా,..?
సంచలన నిర్ణయం
పీసీసీ చీఫ్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. దాని నుంచి కోలుకోకముందే రాజీనామా దెబ్బ పడింది. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ఉన్న నానా పటోలే.. తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ కూటమి.. ఘోరంగా దెబ్బతిన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యతగా.. నానా పటోలే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అని.. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఇక 288 స్థానాలకు గానూ కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 101 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పతనం కనిపించింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే 2021లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. నానా పటోలే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ.. మొత్తం 48 లోక్‌సభ సీట్లకు గానూ 17 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 13 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో మహా వికాస్ ఆఘాడీ కూటమి ఈసారి ఎలాగైనా మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంతా భావించినా.. అది జరగలేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పిన అంచనాలను కూడా అందుకోవడంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి విఫలం అయింది.