సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!!_*:
తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాయకులు గ్రామాల్లోనే మకాం వేసి, మంచి చెడులు అన్నిటితో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఓటర్లతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. అంతేకాకుండా, గ్రామ అభివృద్ధి హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా వచ్చే నెలలోనే పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం కోసం సంబంధిత పంచాయితీ రాజ్ అధికారులతో రేపు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షలో ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాన్ని ఈసీకి వెల్లడిస్తే.. ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేయనుంది. అయితే ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరిలోనే పూర్తి చేసేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. మరో ఈ ఎన్నికలతో పాటుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలు జనవరి 26న ప్రారంభమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు ఇది సరైన సమయం కావొచ్చని ఎమ్మెల్యేలు ప్రతిపాదన ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తుండడంతో రేవంత్ పాలనపై కొంత మేర వ్యతిరేకత వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పథకాలు విడుదల చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే.. లబ్ధిదారుల ఓట్లను క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేల్చడం కీలకమైన విషయం. కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేయించింది. కమిషన్ సిద్ధం చేసిన నివేదిక త్వరలో సర్కార్‌కు సమర్పించనున్నారు. ఈ నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించి, ఆమోదం పొందిన తర్వాత హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కమిషన్ నివేదిక ఆధారంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రానికి పంపాలని ప్రతిపాదన ఉందని సమాచారం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అయితే రేపటి సమీక్షలో దీనిపైన కూడా నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
నోటిఫికేషన్‌పై అంచనాలు
ఫిబ్రవరి తొలి వారంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక సమాచారం త్వరలో రానుంది. గత ఏడాది ఫిబ్రవరి 1న సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.