12 గంటల బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు..
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్ జరుపనున్నట్టు తెలిపింది. మంగళవారంనాడు జరిగిన ‘నబన్నా అభియాన్’ ర్యాలీలో చెలరేగిన హింసాకాండకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి తప్పుపట్టారు. బెంగాల్ నిరసనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాలు మంగళవారంనాడు చేపట్టిన నిరసల నేపథ్యంలో చోటేచేసుకున్న హింసకు మమతా బెనర్జీ బాధ్యత వహించాలని, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుతో ప్రమేయమున్న వారిని కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మమతను నియంతగా పోలుస్తూ, ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యా్ప్తు జరగాలంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా టీఎంసీ పేర్కొన్నందున మమతా బెనర్జీ, పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌కు కూడా సీబీఐ పాలీగ్రాఫ్ టెస్ట్ జరపాలన్నారు.కాగా, మహిళలకు భద్రత కరువుతోందని, ఇందుకు మమతా బెనర్జీ బాధ్యత వహించాలంటూ విద్యార్థి సంఘం ‘ఛాత్రసమాజ్’, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ‘సంగ్రామి జౌత మంచా’ మంగళవారంనాడు ‘నబన్నా అభియాన్’ పేరుతో నిరసనల ర్యాలీలు చేపట్టింది. నార్త్ కోల్‌కతాలోని కాలేజీ స్క్వేర్ నుంచి ఒక ర్యాలీ, హౌరాలోని సాంత్రాగచి నుంచి మరో ర్యాలీ నిర్వహించింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు వాటర్ కేనన్లు, భాష్పవాయువు ప్రయోగించడంతో ర్యాలీలో ఉద్రికత చోటుచేసుకుంది.