మెదక్/నర్సాపూర్, జూలై 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామ్ చరణ్ రెడ్డికి బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. సమయానికి నీటి సరఫరా జరగకపోవడం, వర్షాకాలంలో దోమల తీవ్రత పెరగడం వల్ల ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారని అన్నారు. పట్టణంలోని చెత్త సమస్య, ముఖ్యంగా దేవాలయాల పరిసరాల్లో పడేసే మురుగు నిర్వహణపై అధికారులు స్పందించాలని అన్నారు. కోతుల సంచారం కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, పందుల బెడద కూడా అధికమైందని పేర్కొన్నారు. రోడ్ల సమస్యలు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా పట్టణాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నీరుడు చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, బోర్వెల్ రాంరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బాదే బాలరాజు, ఎస్సి మోర్చా పట్టణ అధ్యక్షుడు బబ్బురి కృష్ణ, మహేందగౌడ్, చిరుమని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ లో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి
Oplus_0