శోభాయాత్రకు ఏర్పాట్లు.. 30 వేల మందితో బందోబస్తు
– *మార్గాన్ని పరిశీలించిన కమిషనర్లు, కలెక్టర్*
– *30 వేల మందితో బందోబస్తు: ఆనంద్*
– *అమిత్ షా హాజరు: డాక్టర్ రావినూతల*
హైదరాబాద్: మహానిమజ్జనం ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌లతో కలిసి బుధవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అంతకుముందు బాలాపూర్ గణనాథుడిని వారు దర్శించుకున్నారు. ఉత్సవ సమితి ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి, కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. బాలాపూర్ నుంచి మొదలయ్యే శోభాయాత్ర చార్మినార్ సర్కిల్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి వంతెన మీదుగా ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్ సాగర్‌కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు చేయాల్సిన ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా చర్యలపై అధికారులు చర్చించారు.
నిమజ్జన పర్వం ప్రశాంతంగా జరిగేలా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. 30 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు 2వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలో 1,21,905 విగ్రహాల నిమజ్జనం జరిగిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. అత్యధికంగా కూకట్‌పల్లి జోన్‌లో 41 వేలకుపైగా, శేరిలింగంపల్లిలో 21 వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగింది. అత్యల్పంగా చార్మినార్‌లో 6,254 విగ్రహాలు గంగ ఒడికి చేరాయి.
నిమజ్జనానికి ఆర్‌టీఏ వాహనాలు
మహా నిమజ్జనం నేపథ్యంలో రవాణా శాఖ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సిఫారసు మేరకు స్థానిక రవాణా శాఖ కార్యాలయాల్లో నిర్వాహకులకు వాహనాలు సమకూరుస్తారు. నేరుగా ఆర్‌టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా అందుబాటులో ఉన్న వాహనాలను పంపుతామని ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 1500లకుపైగా అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ట్రయిలర్/టస్కర్ల అద్దె రూ.33 వేలు కాగా.. హెచ్‌జీవీ, ఎంజీవీ, ఎల్‌జీవీ వాహనాలకు రూ.1000 నుంచి రూ.4500గా నిర్ణయించారు. ఇంధనం, డ్రైవర్, క్లీనర్ల బత్తా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ శాఖల సమీక్ష
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీలు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సామూహిక వినాయక నిమజ్జనోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ గతేడాది 13,250 విగ్రహాల నిమజ్జనం జరగగా ఈ సంవత్సరం ఇప్పటికే 11,700 జరిగాయని తెలిపారు. సామూహిక వినాయక నిమజ్జనోత్సవాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సూచించారు..