ఎల్లారెడ్డి, సెప్టెంబర్19, (ప్రశ్న ఆయుధం):
భారీ వర్షాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటలు, రహదారులు, వంతెనలు బీభత్సానికి గురయ్యాయి. రైతులు పంటలు కోల్పోయి ఆవేదనలో మునిగితేలుతుండగా, ప్రజలు రవాణా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తీరును బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.వారు శుక్రవారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – విపత్తు జరిగి నెలరోజులు గడిచినా, ప్రభుత్వం ఇప్పటికీ మరమ్మత్తు పనులు పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి రహదారి పనులు త్వరితగతిన చేయాలని ఆదేశించినా, ఇప్పటికీ పరిస్థితి మారలేదని మండిపడ్డారు. ప్రజలకు దసరా, దీపావళి పండగల సమయంలో రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వారు ఎద్దేవా చేశారు.లింగంపల్లి బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతుండటాన్ని ఉదాహరించిన వారు – అభివృద్ధి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం కంటే, రోడ్లు సరిచేయడం, కాలువల చెత్త తొలగించి రైతులకు నీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గట్టిగా హెచ్చరించారు.ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, పంటలు వర్షాలపై ఆధారపడి అడపా దడపా బతుకుతున్నాయని వారు దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలో నష్టపరిహారం చెల్లింపులు లేకపోవడం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“దసరా పండుగ మా నియోజకవర్గ ప్రజలకు పండుగలా కాకుండా దండగగా మారింది. పండుగకు వెళ్ళే రోడ్లు లేవు, పంటకు సాగునీరు లేదు. ఇది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం” అని బిఆర్ఎస్ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో ఆదిమూలం సతీష్ కుమార్, జలంధర్ రెడ్డి, నర్సింలు, సాయిలు, శ్రవణ్ కుమార్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, రాజయ్య, దేవదాస్, దయాకర్, బబ్లు, పృథ్వీరాజ్, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.