రాజకీయకక్షలకు తావివ్వకుండా కబ్జాదారులు ఏ పార్టీ అయినా బుల్డోజర్ తోలాల్సిందే

*రాజకీయకక్షలకు తావివ్వకుండా కబ్జాదారులు ఏ పార్టీ అయినా బుల్డోజర్ తోలాల్సిందే

*చెరువులను, ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలి

*పార్వతీపురం డిప్యూటీ తహసిల్దారును కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి 23-04-2025(ప్రశ్న ఆయుధం న్యూస్)దత్తి మహేశ్వరరావు

పార్వతీపురంలో జరిగిన కబ్జాలన్నింటిపైన బుల్డోజర్ తోలాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం డిప్యూటీ తహసిల్దార్ పి.కిరీటిని కలిసి పార్వతీపురం పట్టణం, మండలంలో జరిగిన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఏ పార్టీ వారైనా ఎంతటి వారివైనా వాటి పైకి బుల్డోజర్ తీసుకెళ్లి కబ్జాలు తొలగించాలన్నారు. చెరువులు, గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వాటిల్లో కొంతమంది అక్రమార్కులు పక్కా భవనాలు కూడా నిర్మించారన్నారు. బిళ్ళబంధ, దేవుడిబంధ, నెల్లిచెరువు, లక్ష్మ నాయుడు చెరువు, కోదువానిబంధ, లంకెల చెరువు, వరహాల గెడ్డ, సంఘం నాయుడు చెరువు, రాయబంధ, తమ్మి నాయుడు చెరువు, బోటువాని చెరువు, పాత్రుడు గారి కోనేరు, కొత్తచెరువు, గోప సాగరం తదితర చెరువులు దాదాపు ఆక్రమణకు గురయ్యాయన్నారు. వీటితోపాటు పట్టణంతో పాటు నలదిక్కులా ఉన్న ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాకు గురయ్యాయన్నారు. కాబట్టి వాటికి సర్వే చేయించి ఆక్రమణలను బుల్డోజర్ తో తొలగించాలన్నారు. పనిగట్టుకొని ఒకరిద్దరివి తొలగించడం సరికాదని, అదేపనిగా అందరి కబ్జాలను తొలగించాలన్నారు. పక్షపాత ధోరణి లేకుండా అందరి ఆక్రమణలను తొలగించాలన్నారు. ముందు చెరువుల్లో నిర్మితమైనట్లు ఆరోపణలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ సిబ్బంది భవనాలు తొలగించాలన్నారు. కళ్ళ ముందే ఆక్రమణలు జరుగుతున్న పట్టీ పట్టనట్లు వ్యవహరించే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. చిత్తశుద్ధితో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పార్వతీపురంలోని చెరువులు, గెడ్డలు, ప్రభుత్వ స్థలాలను రక్షించాలని కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.

Join WhatsApp

Join Now