ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబా

IMG 20240811 WA0072

గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబాలను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నస్కల్‌ గ్రామంలో శనివారం జరిగింది. ఎస్సై సంతోష్‌ తెలిపిన ప్రకారం బులేరో వాహనంలో డ్రైవర్‌తోపాటు ముగ్గురు వ్యక్తులు బాబా వేషధారణలో నస్కల్‌కు వచ్చారు. ఆకలవుతుందని, భోజనం పెట్టించమని గ్రామానికి చెందిన శ్రీధ]ర్‌ను కోరారు. హోటల్‌లో అన్నం తిన్నాక, అతని వేలికున్న బంగారు ఉంగరాన్ని కాజేయాలని పన్నాగం పన్నారు. నీ జాతకం సరిగా లేదు, మీ ఇంటికి వెళ్లి పరిశీలించి మంచి చేస్తామని నమ్మించారు.  ఇంటికి వెళ్లాక, రాగి చెంబు, ఉంగరాన్ని ఇవ్వాలని, మంత్రించి ఇస్తామన్నారు. ఉంగరాన్ని మంత్రించి రాగి చెంబులో వేసినట్లు నటించి, తెల్లని వస్త్రంలో చుట్టి, ఇప్పుడు తెరవద్దని హెచ్చరించారు. అనంతరం శ్రీధర్‌ ఇంట్లో ఉండగానే తలుపులువేసి గడియపెట్టి వెళ్లడంతో అనుమానంతో చెంబును తెరిచి చూడగా ఉంగరానికి బదులుగా రాయి కనిపించింది. మోసం చేశారని గ్రహించిన శ్రీధర్‌ తన కుమారుడికి  ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. అతను వెంటనే అప్రమత్తమై గ్రామస్థులతో కలిసి, వాహనంలో పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న దొంగ బాబాలను అడ్డుకుని దేహశుద్ధి చేశారు.  అనంతరం నలుగురిని పోలీసులకు అప్పగించారు. నిందితులు రాజస్థాన్‌ పాలీ జిల్లాకు చెందిన చెట్టిదూదాని గ్రామానికి చెందిన రామ్‌నాథ్, మిథానాథ్, మేఘనాథ్, డ్రైవర్‌ రాజేందర్‌ది సిరాజి జిల్లా స్వరూప్‌గంజ్‌ గ్రామం. ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now