పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్, అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా, లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా, అటువంటి వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా సక్రమంగా కొనసాగేలా సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం లేదా అనవసర ఆందోళనలకు లోనయ్యి ఇబ్బందలు పడే అవసరం లేదని సూచించారు.
బంక్ నిర్వాహకులు పారదర్శకంగా, క్రమ పద్ధతిలో విక్రయాలు నిర్వహించి, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అలాగే అలజడులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను భయభ్రాంతులను చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎవరైనా డీజిల్, పెట్రోల్ విక్రయాలను బ్లాక్ చేసినా, నల్లబజారులో విక్రయించినా, లేదా కొరత ఉందని అసత్య ప్రచారాలు చేసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు.











