ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఈ రంగాల్లో రాష్ట్రం అవకాశాల ఖని అని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన వివరించారు.
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం 'యూఎస్ నేషనల్ కాలేజ్ వార్' బృంద సభ్యులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, అనుకూలతలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలను మంత్రి వివరించారు.
రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు... అన్నింటిలోనూ ‘మేడిన్ తెలంగాణ’ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని మంత్రి తెలిపారు. ఈ రంగం ఏటా 30 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తోందని, 2024-26 మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) నమోదయ్యిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలతో పాటు, ప్రిసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు ‘తెలంగాణ బ్రాండ్’ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్ డీఏ ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ‘కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీ’గా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఐదుసార్లు ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును గెలుచుకుని తెలంగాణ గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌లో ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందని ఆయన వివరించారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు అవసరమైన ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని, టీజీ ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోగా అనుమతులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన ‘రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్’ను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడులకు మాత్రమే కాదు, సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్ధిలో అమెరికాకు ఒక నమ్మకమైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామిగా నిలిచేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.











