కామారెడ్డి జిల్లాలోని ఆయిల్ పరిశ్రమల కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట నూనెల తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడి సరుకుల వినియోగం వంటి అంశాలపై స్థానికుల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాలోని ఒక ప్రముఖ ఆయిల్ ఫ్యాక్టరీలో గింజల నుంచి పూర్తి స్థాయి నూనె తయారీ జరుగుతుందా? లేక బయట నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చి కేవలం శుద్ధి చేసి ప్యాకింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఫ్యాక్టరీ వద్ద తరచూ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
స్థానిక రైతుల నుంచి ముడి సరుకు కొనుగోలు జరుగుతోందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమ పూర్తి స్థాయి తయారీ యూనిట్‌గా పనిచేస్తోందా? లేక రిఫైనింగ్, ప్యాకింగ్ యూనిట్‌గా మాత్రమే పరిమితమైందా? అన్నది అధికారికంగా వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నూనెల శుద్ధి విధానం, నాణ్యత నియంత్రణ ప్రమాణాలు, వాడుతున్న ముడి సరుకుల మూలం వంటి కీలక అంశాల్లో పారదర్శకత లోపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తయారవుతున్న నూనెలు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయంపై సంబంధిత శాఖలు అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరు నెలల క్రితం ప్రజావాణి కార్యక్రమంలో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత సంస్థ (FSSAI), పరిశ్రమల శాఖ, జిల్లా పరిపాలన సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ అనుమానాలు మరింత పెరిగి ప్రజల్లో అవిశ్వాసానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.










