జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించేందుకు సర్వే కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లాలో, జహీరాబాద్ నిమ్జ్ పరిధిలోని టీజీఐఐసీ భూములు, నిమ్జ్/ఎన్ఐసీడీసీ పరిధిలోని భూముల అభివృద్ధి, సర్వే ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధిత అధికారులతో బుధవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన లేఅవుట్ అభివృద్ధి కోసం త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ ప్రకారం రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ శాంతియుత వాతావరణంలో జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు ముందుగా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా సర్వే నిర్వహించి, సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే పనులు వేగవంతం చేయడానికి రెవెన్యూ, సర్వే, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొలతలతో సర్వే పూర్తి చేయాలని సూచించారు.
సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, పెండింగ్ సమస్యలు, భూ స్వాధీనం ప్రక్రియలో ఉన్న అంశాలను సమీక్షించారు. అడ్వాన్స్ పోజెషన్, భూముల బదిలీ అంశాలపై చర్చించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. పరిశ్రమల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.











