*_రేపటి నుంచి ఏపీజీవీబీకి బైబై..!!_*
దేశంలోనే తొలి గ్రామీణ బ్యాంకు ఖమ్మంలో ఏర్పాటైంది. 1976 ఏప్రిల్ 30న అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ‘నాగార్జున గ్రామీణ బ్యాంకు’ పేరిట ఖమ్మం రైల్వేస్టేషన్ రోడ్డు వెంట దీన్ని ప్రారంభించారు.
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అందుబాటులోకి తేవాలని అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వరమైంది. నల్గొండ, ఖమ్మం జిల్లాకు కలిపి ఆనాడు ఖమ్మం ప్రధాన కేంద్రంగా బ్యాంకు పనిచేసింది. బడుగు, బలహీనవర్గాలు, సన్న,చిన్నకారు రైతులకు పంట రుణాలతో పాటు వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఈబ్యాంకు ఇతోధికంగా అప్పులు మంజూరు చేసింది. తద్వారా గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారిపోయింది. వడ్డీ వ్యాపారుల నుంచి అన్నదాతలకు విముక్తి కలిగింది. అప్పటివరకు సహకార బ్యాంకులు మినహా పెద్ద పెద్ద బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు బడా వ్యాపారులకు మాత్రమే అప్పులిచ్చేవి. గ్రామీణ బ్యాంకు మాత్రమే సామాన్యుల సేవే పరమావధిగా శాఖలను ఏర్పాటుచేసి అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది.
*_మారిన బ్యాంకుల బోర్డులు.._*
కొత్తగా ఏర్పాటయ్యే ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’ పేరిట ఖమ్మంలోని ప్రాంతీయ కార్యాలయం వద్ద బోర్డు ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని వివిధ బ్యాంకు శాఖల వద్ద పాత బోర్డులను తొలగించి కొత్త వాటిని అమర్చారు. ఉభయ జిల్లాల్లో జనవరి 1 నుంచి ప్రతి బ్యాంకుశాఖ వద్ద కొత్త బోర్డులు కనిపించనున్నాయి.
*_బ్యాంకుల విభజన దేశంలోనే తొలిసారి.._*
ప్రస్తుతం ఏపీజీవీబీని విభజించి ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’గా మార్చుతున్న విషయం విదితమే. దేశ చరిత్రలో బ్యాంకుల విభజన జరగటం ఇదే ప్రథమం. ఇప్పటివరకు బ్యాంకులను విలీనం చేశారే తప్ప విభజించలేదు. నాగార్జున గ్రామీణ బ్యాంకు 2006లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా ఏర్పడింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన ఈబ్యాంకుతో పాటు వరంగల్‌లోని కాకతీయ గ్రామీణ బ్యాంకు, మెదక్‌లోని మంజీరా గ్రామీణ బ్యాంకు, మహబూబ్‌నగర్‌లోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, విశాఖపట్నంలోని విశాఖ గ్రామీణ బ్యాంకులను కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్), యూనియన్ బ్యాంకులో ఆంధ్రాబ్యాంకు, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇలా తదితర రకాల బ్యాంకులను విలీనం చేశారు. తాజాగా ఏపీజీవీబీని విడగొట్టి రాష్ట్రంలో ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’గా మార్చుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీజీవీబీ పేరిట సేవలు కొనసాగనున్నాయి.
బ్యాంకు పేరు మారుతున్న సందర్భంగా మంగళవారం వరకు ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అత్యవసరమైన ఖాతాదారు బ్యాంకుశాఖకు వెళ్లి రూ.10వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. పెళ్లిళ్లు, అత్యవసర ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అవసరమైనంత నగదును డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాం. జనవరి 1 నుంచి యథావిధిగా బ్యాంకు పనిచేస్తుంది.