Site icon PRASHNA AYUDHAM

అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసా నమోదు చేయాలి: జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్

IMG 20251203 203255

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు పూర్తి ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలకుల పరిశీలనకు మూడు సార్లు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. రెండవ విడత ఎన్నికలు జరుగనున్న అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్పల్లి, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, మునిపల్లి మండలాలకు సంబంధించి డిసెంబర్ 8న మొదటి విడత, డిసెంబర్ 10న రెండవ విడత, డిసెంబర్ 12న మూడవ విడతగా మూడు సార్లు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల రికార్డులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో మూడవ విడత ఎన్నికలు జరుగనున్న కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాలకు సంబంధించి డిసెంబర్ 11న మొదటి విడత, 13న రెండవ విడత, 15న మూడవ విడతగా మూడుసార్లు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల రికార్డులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఆయా తేదీలలో సంబంధిత మండల పరిషత్ అధికారి కార్యాలయంలో ఉదయం 10 నుండి 5 గంటల మధ్య ఎన్నికల ఖర్చుల రికార్డులను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలనకు హాజరుకాని అభ్యర్థికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. నోటీసులకు సరియైన సంజాయిషీ లేనట్లయితే ఎన్నికల నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఎన్నికల ఖాతా నిర్వహణ రిజిస్టర్లు, సంబంధిత డాక్యుమెంట్లతో పరిశీలకుల ముందు ఆయా తేదీలలో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. 2011 జనాభా లెక్కల మేరకు 5వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీ లలో సర్పంచి అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రెండు లక్షల 50 వేలు కాగా, వార్డు మెంబర్లకు 50 వేల వ్యయ పరిమితి గలదని, 5వేల లోపు జనాభా గల గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థికి గరిష్ట వ్యయపరిమితి 1.5 లక్షలు, వార్డ్ మెంబర్ కు 30 వేలు అని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలకు స్థానిక తహసిల్దార్ దగ్గర అనుమతి పొందాలని, అనుమతి లేకుండా వినియోగించినట్లయితే ఎన్నికల నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలలో ఖర్చు చేసే ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసాను తమ ఖర్చుల ఖాతాలో చూపించాలని ఆయన సూచించారు.

Exit mobile version