పెట్టుబడిదారులకు ద్రవ్య బదలాయింపులు

 పెట్టుబడిదారులకు ద్రవ్య బదలాయింపులు

ప్రభాత్‌ పట్నాయక్‌

ఈ మధ్య ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ధనాన్ని బదలాయించడం మామూలైపోయింది. కార్పొరేట్‌ పన్నులను తగ్గించడం ద్వారా గాని, నేరుగా కాని ధనాన్ని బదలాయిస్తున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవాలని భావిస్తున్నాయి ప్రభుత్వాలు. డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇదే ఉద్దేశ్యంతో కార్పొరేట్‌ పన్ను తగ్గించాడు. ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా అదే ఉద్దేశ్యంతో భారీగా పన్ను రాయితీలను కార్పొరేట్లకు కట్టబెడుతోంది. ఐతే ఆర్థిక శాస్త్రంలో కనీసపు అవగాహన ఉన్నవారికి కూడా ఈ మాదిరి బదలాయింపుల వలన నయా ఉదారవాద వ్యవస్థలో ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ఫలితాలు వస్తాయని తెలుసు.

నయా ఉదారవాద వ్యవస్థలో ద్రవ్యలోటు జిడిపిలో ఒకానొక నిర్ణీత శాతానికి మించకుండా ఉండాలనే నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వాలు సాధారణంగా ఆ పరిమితికి లోబడే నడుచు కుంటాయి. అటువంటప్పుడు పెట్టుబడి దారులకు ద్రవ్యాన్ని బదలాయించడం అంటే ఇంకెక్కడో ప్రభుత్వం తన ఖర్చు తగ్గించు కోవలసి వస్తుంది. మామూలుగా ఇలా ఖర్చు తగ్గించుకోవలసి వచ్చినప్పుడు ఆ వేటు ప్రజా సంక్షేమ పద్దుల మీదే పడుతుంది. లేదా శ్రామిక ప్రజల నుండి అదనంగా పన్నుల రూపంలో రాబట్టవలసి వస్తుంది. పెట్టుబడిదారులకు రూ.100 బదలాయించడానికి కార్మికులకు ఇచ్చే సంక్షేమంలో రూ.100 కోత పెట్టారనుకుందాం. అప్పుడు ఆ మేరకు స్థూల డిమాండ్‌ తగ్గిపోతుంది. దాని పర్యవసానంగా ఉపాధి, ఉత్పత్తి కూడా తగ్గిపోతాయి. అంటే పెట్టుబడిదారులకు ధనాన్ని బదలాయించడం వలన ఆర్థిక వ్యవస్థ అదనంగా ఊపు అందుకునేది ఏమీ ఉండదు సరికదా, ఉన్న స్థాయి నుంచి ఇంకా ముడుచుకు పోతుంది. కార్మికుల మీద అదనపు పన్నుల భారాన్ని మోపినా ఇదే జరుగుతుంది. ఈ పరిణామం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం.

ఈ ఏడాదిలో ఎంత పెట్టుబడులు పెట్టాలన్నది ఇంతకు ముందే తీసుకున్న నిర్ణయాల ఆధారంగా జరుగుతుంది. పరిశ్రమల కోసం పెట్టే పెట్టుబడులు కార్యరూపం ధరించడానికి, ప్రాజెక్టులు పూర్తి అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రభుత్వ రంగంలోనైనా లేక ప్రైవేటు రంగంలోనైనా సరే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టే వేగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు అదనపు ఊపు తేవాలనుకుంటే ఈ ఏడాది తీసుకున్న నిర్ణయం అమలు కావడానికి వచ్చే ఏడాది వరకూ సమయం పడుతుంది. ఆ తర్వాతే ఆ ఊపు పెరుగుతుంది. అదనపు పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయంతో బాటు ఇప్పుడు ఎంత మోతాదులో పెట్టుబడి పెడుతున్నారో అది కూడా యథాతథంగా అదే స్థాయిలో కొనసాగాలి. ఐతే, ఈ లోపు ఈ ఏడాదిలో ఉత్పత్తి వినిమయం అయ్యే స్థాయిలో మార్పు వస్తుంది. సాధారణంగా కార్మికులు తమకు లభించే ఆదాయంలో అత్యధిక శాతం వెంటనే ఖర్చు చేసేస్తారు. పెట్టుబడిదారులు అలా కాదు. ఇప్పుడు కార్మికుల సంక్షేమానికి కోత పెట్టో లేక వారి మీద అదనంగా పన్నులు పెంచో ఆ సొమ్మును పెట్టుబడిదారులకు బదలాయిస్తే అప్పుడు వినిమయం స్థాయి తగ్గిపోతుంది.

అంతే కాదు, పెట్టుబడిదారులు వినియోగించే సరుకులలో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారా లభించేవే. వారికి అదనంగా ధనం బదలాయిస్తే అప్పుడు దిగుమతులు పెరుగుతాయి. వాటితో పోల్చినప్పుడు ఎగుమతుల నిష్పత్తి తగ్గిపోతుంది. ఐతే వాదన కోసం అలా జరగదని, పెట్టుబడిదారులకు అదనంగా ద్రవ్యం బదలాయించినా ఎగుమతి-దిగుమతి నిష్పత్తిలో ఏ మార్పూ ఉండదని అనుకుందాం.

దేశంలోని వినిమయం ‘వి’ అన్న అక్షరంతో సూచిద్దాం. అలాగే దేశంలో ఆ ఏడాది పెట్టిన పెట్టుబడిని ‘పె’ అన్న అక్షరంతోను, ప్రభుత్వ వ్యయాన్ని ‘ప్ర’ అన్న అక్షరంతోను, ఎగుమతుల విలువను ‘ఎ’ అన్న అక్షరంతోను, దిగుమతుల విలవను ‘ది’ అన్న అక్షరంతోను సూచిద్దాం. అప్పుడు దేశంలో మొత్తం స్థూల జాతీయ ఆదాయం (‘ఆ’ అనే అక్షరంతో సూచిద్దాం) లెక్కించాలంటే వినిమయం+పెట్టుబడి +ప్రభుత్వ వ్యయం+ (ఎగుమతుల విలువ-దిగుమతుల విలువ) అవుతుంది. దీనినే

ఆ = వి+పె+ప్ర+ (ఎ-ది) అని సూత్రంగా చెప్పవచ్చు.

ఇందులో ‘వి’ అన్నది (వినిమయం) తగ్గితే అప్పుడు ‘ఆ’ (స్థూల జాతీయ ఆదాయం) కూడా తగ్గిపోవడం అనివార్యంగా జరుగుతుంది. అది ఉత్పత్తిలో, ఉపాధిలో తగ్గుదల రూపంలో వ్యక్తం ఔతుంది.

ఇది జరిగిందంటే ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్న పరిశ్రమల స్థాపక సామర్ధ్యాన్ని వినియోగించే స్థాయి తగ్గిపోతుంది. ఉన్న సామర్ధ్యాన్నే పూర్తిగా వినియోగించలేనప్పుడు అదనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రారు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ఊపందుకోడానికి బదులు ముడుచుకుపోతుంది.

ఐతే వ్యవహారం ఇక్కడితో ఆగిపోదు. ఆర్థిక వ్యవస్థ ముడుచుకు పోయినప్పుడు దాని ఫలితంగా లాభాలు తగ్గిపోతాయి. అంటే పెట్టుబడిదారులకు అదనంగా ద్రవ్యాన్ని బదిలీ చేయడం కోసం కార్మికుల కొనుగోలు శక్తికి కోత పెట్టడం వలన పెట్టుబడిదారులకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. పెట్టుబడిదారులకు అదనంగా బదలాయించిన ధనం ఎంత ఉంటుందో, దాదాపుగా అదే మోతాదులో వారి లాభాలు తగ్గిపోతాయి. అంటే నికరంగా వారి లాభాల స్థాయిలో ఏ మార్పూ ఉండదు.

మన దేశంలో ఆర్థిక స్థాయిలో అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజానీకం దగ్గర దేశ సంపదలో కేవలం 2 శాతం మాత్రమే ఉంది. వారు తమ ఆదాయాల్లో పొదుపు చేయగలిగినదంటూ ఏమీ ఉండదు. ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవస్థలో పొదుపు చేసే సంపద అంతా పైస్థాయిలో ఉన్నవారి ద్వారానే జరుగుతుంది.

సంపన్నులు-అంటే పెట్టుబడిదారులు వారి ఆదాయాన్ని మొత్తం పొదుపు చేస్తారనుకుందాం. వారి ఆదాయం అంటే వారికి వచ్చిన లాభాల మొత్తమే కదా. ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా, మొత్తం దేశీయ పొదుపు లేదా పెట్టుబడిదారుల లాభం ఆ ఏడాది పెట్టిన ప్రైవేటు పెట్టుబడి+ ఆ ఏడాది ద్రవ్య లోటుతో (ఇందులో నుంచి విదేశీ పొదుపును తీసెయ్యాలి) సమానంగా ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థలో వృద్ధి లేనప్పుడు ప్రైవేటు పెట్టుబడి పెరగదు. ద్రవ్య లోటును పెంచడానికి వీలు లేదు. విదేశీ పొదుపు కూడా ఆర్థిక వృద్ధి లేనప్పుడు పెరగదు. ఇవన్నీ స్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారుల లాభాలు కూడా స్థిరంగానే ఉంటాయి తప్ప పెరగవు. అందుచేత పెట్టుబడి దారులకు బడ్జెట్‌ ద్వారా చేసే బదలాయింపులు పెట్టుబడిదారుల లాభాలను పెంచవు. ఆర్థిక వ్యవస్థ ఊపు అందుకోవడానికీ తోడ్పడవు. పైగా ఆర్థిక వ్యవస్థ మరింత మడుచుకు పోవడానికే దారి తీస్తాయి. మరి అటువంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఈ బదలాయింపులకు పూనుకుంటోంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం పెట్టుబడిదారుల లాభాలు ఏమీ మారవు అని తెలుసుకున్నాం. ఐతే, ఆ పెట్టుబడిదారుల్లో గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా లాభాల పంపిణీ జరగడానికే ప్రభుత్వం ఈ బదలాయింపులకు పూనుకుంటోంది. కార్మికుల ఆదాయాలను తగ్గించడం ద్వారా ఈ బదలాయింపులు జరుగుతున్నాయి. దాని వలన కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఆ కార్మికులు కొనుగోలు చేసే సరుకుల అమ్మకాలు తగ్గిపోతాయి. వాటిని ఉత్పత్తి చేసేవారిలో ఎక్కువ శాతం చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులు ఉంటారు. వారి లాభాలు బాగా తగ్గిపోతాయి. ఇంకోవైపు ప్రభుత్వం చేసే ద్రవ్య బదలాయింపుల్లో ఎక్కువ శాతం గుత్త పెట్టుబడిదారులు. బడా కార్పొరేట్లు దక్కించుకుంటారు. వాటిలో చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులకు దక్కేది చాలా తక్కువ. అంటే ఈ మొత్తం ప్రక్రియలో చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులు దెబ్బ తింటారు. గుత్త పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్లు మరింత లాభపడతారు.

ఈ ప్రక్రియనే మార్క్స్‌ ”పెట్టుబడి కేంద్రీకరణ” అని అన్నాడు. ఈ విధమైన బదలాయింపుల వలన గుత్త పెట్టుబడిదారులు మరింత బలపడతారే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థకు అదనంగా ఏ ఊపూ లభించదు.

పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్‌టి అమలు లోకి వచ్చినప్పుడు ఆ చర్యల ఫలితంగా చిన్న, మధ్య స్థాయి పెట్టుబడిదారులు బాగా దెబ్బ తిన్నారని ప్రతిపక్షాలు, మీడియాలో ప్రధాన భాగం విమర్శించాయి. ఆ చర్యల పర్యవసానాలను వారు గుర్తించినట్టు ఈ ద్రవ్య బదలాయింపుల పర్యవసానాన్ని గుర్తించడం లేదు.

( స్వేచ్ఛానుసరణ )

ప్రభాత్‌ పట్నాయక్‌

Join WhatsApp

Join Now

Leave a Comment