సెప్టెంబర్‌ 22 నుంచి కర్ణాటకలో కులగణన..!!

*_సెప్టెంబర్‌ 22 నుంచి కర్ణాటకలో కులగణన..!!_*

*_సీఎం సిద్దరామయ్య నిర్ణయం_*

శివాజీనగర: కర్ణాటక ప్రభుత్వం మరోసారి కులగణనకు తేదీలను ఖరారుచేసింది. సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 7వ తేదీదాకా కులగణన చేపట్టాలని బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

కులగణన లక్ష్యంగా జరగనున్న నూతన సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే విషయమై ముఖ్యమంత్రి నివాస కార్యాలయంలో ప్రత్యేక భేటీ జరిగింది.

వివిధ శాఖల మంత్రులు, వెనుకబడిన వర్గాల కమిషన్‌ అధ్యక్షుడైన మధుసూదన్‌ పాల్గొని కులగణన నిర్వహించే విధానంపై చర్చించారు. ఎలాంటి లోపాలు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుని సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ”రాష్ట్రంలో కులగణన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతిపక్షాలచే ఆరోపణలు రానివ్వకూడదు.

మానవ వనరులతో పాటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పకడ్బందీగా నిర్వహించండి. కులవివక్షను రూపుమాపడంతోపాటు వెనుకబడిన వర్గాలకు తగు పథకాలు అమలుచేసేందుకు ఈ కులగణన గణాంకాలు సాయపడతాయి”అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 7 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రవ్యాప్తంగా కేవలం 15 రోజుల్లోనే సర్వేను పూర్తి చేయాలని సీఎం సూచించారు. అక్టోబర్‌ నెలాఖరుకల్లా సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

కొన్నినెలల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణనను నిర్వహించిన సంగతి తెల్సిదే. అయితే సర్వేలో తమ జనాభాను తక్కువ చేసి చూపించారని ఒక్కలిగ, వీరశైవ లింగాయత్, ఎస్సీలు, బీసీల కులాలు తీవ్ర ఆందోళన చేయడం విదితమే. అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిని వ్యక్తంచేశారు. దీనివల్ల ప్రభుత్వం మరోసారి కులగణనకు

సిద్ధమైంది. గతంలో కంథరాజు కమిషన్‌ సారథ్యంలో సర్వే చేపట్టారు. ఆనాడు 54 ప్రశ్నలకు సమాధానాలను ప్రజల నుంచి సేకరించారు. ఈసారి మొబైల్‌ యాప్‌ను వినియోగించనున్నారు. ఈసారి 1.65 లక్షల మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వేలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సీఎంతో భేటీలో వెనకబడిన కులాల సంక్షేమ మంత్రి శివరాజ్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ మధుసూదన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now