టెస్లా కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత విఫణిలోకి అడుగు పెడుతోంది. భారత భూభాగంపై టెస్లా కార్ల తయారీకి కొంత సమయం పట్టినా… ఆ సంస్థ విదేశాల్లో తయారు చేస్తున్న వాహనాలు త్వరలోనే భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ముంబైలోనూ టెస్లా షోరూమ్ ల ఏర్పాటు అప్పుడే ప్రారంభమైపోయింది. ఈ షోరూమ్ ల సిబ్బంది కోసం టెస్లా ప్రకటన విడుదల చేయడం, సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభమైపోయింది కూడా. ఈ లెక్కన టెస్లా కార్ల ఉత్పత్తి భారత్ లో ప్రారంభం కావడం ఇక లాంఛనమేనని చెప్పక తప్పదు. ఈ క్రమంలో టెస్లా కార్ల ఉత్పత్తి ప్లాంట్ ను ఎగురవేసుకుపోయేందుకు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమ వంతు యత్నాలను ముమ్మరం చేశాయి. అందులో ఏపీ జెట్ స్పీడుతో కదులుతోంది.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవలే పాలనా బాధ్యతలు చేపట్టంది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లలో ఎలాగైనా గట్టెక్కించాలన్న లక్ష్యంతో సాగుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ 8 నెలల కాలంలోనే రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించే నిమిత్తం మంత్రి హోదాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గత ఏడాది చివరలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టెస్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాకు వివరించారు. తనేజా కూడా లోకేశ్ ప్రజెంటేషన్ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై టెస్లాలో అంతర్గత చర్చలు జరగినట్టు కూడా సమాచారం.
వాస్తవానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో చంద్రబాబు బంధం ఈనాటిది కాదు. 2014లో తెలుగు నేల విభజన జరిగిన తర్వాత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబే వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో అప్పుడే మస్క్ తో టచ్ లోకి వెళ్లిన చంద్రబాబు… టెస్లా చేత ఏపీలో రెండు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఈ లెక్కన పాత స్నేహ సంబంధాలను చంద్రబాబు ఓ సారి వెలికి తీస్తే.. టెస్లా కార్ల తయారీ ప్లాంట్ ను ఏపీకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎంత స్నేహం, పాత పరిచయాలు ఉన్నా… ఏ కంపెనీ అయినా తన ప్లాంట్ ఏర్పాటుకు తగిన వసతి సౌకర్యాలను పరిశీలించకుండా ముందడుగు వేయలేదు కదా. ఈ విషయంలోనూ టెస్లాకు ఎలాంటి అవరోధాలు లేకుండా చంద్రబాబు బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
టెస్లా ముందుగా భారత్ లోకి తన వాహనాలను దిగుమతి చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను టెస్లా పరిశీలిస్తోంది. ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం సొంతం. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఈ తీరం వెంట లెక్కలేనన్ని పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పోర్టుల సమీపంలో టెస్లా తన ఇంపోర్టెడ్ కార్లను నిలువ చేసుకునేందుకు భారీ స్థాయిలో స్థలాన్ని కేటాయించే దిశగా ఏపీ కదులుతోంది. అంతేకాకుండా సదరు ప్రదేశానికి కావలసిన మౌలిక వసతులన్నింటిని అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇక ఉత్పత్తి ప్లాంట్ విషయానికి వస్తే… అనంతపురం జిల్లాలో బాబు హయాంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తే సరిపోతుంది. ఈ అన్ని విషయాలతో ఓ సమగ్ర నివేదిక సిద్ధం చేసిన ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ) టెస్లాతో చర్చల కోసం రంగంలోకి దిగిపోయిందట. అనువైన సమయంలో ఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబుతో పాటు లోకేశ్ లు సదా సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.