బూడిద వివాదం: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆది నారాయణరెడ్డిలకు చంద్రబాబు నుంచి పిలుపు

*బూడిద వివాదం: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆది నారాయణరెడ్డిలకు చంద్రబాబు నుంచి పిలుపు*

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలను అమరావతికి రావాలని సీఎంఓ నుంచి గురువారం నాడు పిలుపు వచ్చింది. కడప ఆర్ టీ పీపీ ఫ్లైయాష్ విషయంలో ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై సీఎంఓ, కడప జిల్లా అధికారులతో చంద్రబాబు నవంబర్ 27 న మాట్లాడారు. వివాదం గురించి ఆరా తీశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీస్తే సహించేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

*అమరావతికి రావాలని జేసీ, ఆదినారాయణ రెడ్డికి పిలుపు*

 కడప ఆర్ టీ పీపీ ఫ్లైయాష్ వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలను నవంబర్ 29న అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు.ఫ్లైయాష్ తరలించే విషయంలో ఈ ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ విషయమై చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం నేపథ్యంలో ఆర్ టీ పీపీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

*అసలు వివాదం ఏంటి?*

రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో ప్రతి రోజూ దాదాపు 4 వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ బూడిదను అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసేవారని చెబుతారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బూడిద తరలింపుపై ఈ రెండు జిల్లాలకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధుల కన్ను పడింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఈ బూడిదను తీసుకెళ్తున్నారు.అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇందుకు అభ్యంతరం చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు చెందిన లారీలు ఆర్టీపీపీ ప్లాంట్ కు వెళ్లినా బూడిద లోడ్ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప, అనంతపురం జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. ఈ విషయమై ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి లేదు. దీంతో బూడిద తరలింపుపై రెండు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now