ఇస్రోజీవాడిలో పంచాయతీ సిబ్బందికి చెక్కు అందజేత.
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, సెప్టెంబర్ 12:
కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామంలో పంచాయతీ సిబ్బందికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చెక్కు అందజేసిన కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామపంచాయతీ వాటర్‌మ్యాన్ భూమయ్య గత 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల క్రితం వాటర్ ట్యాంక్ వద్ద ప్రమాదవశాత్తు జారి కాలు విరగడంతో ఆయనకు చికిత్స కోసం పోస్ట్ ఆఫీస్ పాలసీ క్లెయిమ్ చేయగా రూ.1,06,000 మంజూరైంది.
ఈ మొత్తాన్ని ఎంపీడీవో రాణి ముఖ్య అతిథిగా హాజరై చెక్కు రూపంలో భూమయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “ప్రతి ఒక్కరు ఆరోగ్య, ప్రమాద భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ పాలసీలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలాంటి అనుకోని సంఘటన జరిగినా ఇది ఎంతో మేలు చేస్తుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజర్ అభిమన్యు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్ రావు, గ్రామ కార్యదర్శి దుబ్బాక కల్పన, గ్రామ పెద్దలు పెంటయ్య, అశోక్, సంతోష్, డోకోటి సుదర్శన్ రావు, గైని శోభ తదితరులు పాల్గొన్నారు.