*నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభం
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు.
తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ను మినహాయించి, మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి సంవత్సరం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4,50,000 ఇళ్లను ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లికి చేరుకుంటారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.