ఎల్లారెడ్డి సెప్టెంబర్ 19, (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్ సరైన నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఈ పార్కు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం పార్కు పరిసరాలు చెత్తతో నిండిపోవడంతో పాటు గడ్డి పెరిగి పాములు, విషపురుగుల నివాసంగా మారిందని వారు తెలిపారు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం వచ్చే చిన్నారులు, మహిళలు, యువకులు – కొంతమంది వ్యక్తులు కిల్లిలు, పాన్ పరాకులు నమిలి వాకింగ్ ట్రాక్, కుర్చీల వద్ద ఉమ్మేయడం, సిగరెట్లు కాల్చడం వల్ల తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తినుబండారాలు కూడా చెదురుమదురుగా పడేయడం పార్కు వాతావరణాన్ని మరింత చెడగొడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
పిల్లల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్ పాడైపోయి పనికిరాకుండా పోయాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా, పార్కు పరిధిలో నిర్మించిన మరుగుదొడ్లు నేటికీ తాళాలు వేసి మూసివేసి ఉండడంతో, పార్కును సందర్శించే పెద్దలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
“లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన పార్కు ఇప్పుడు పోకిరీలకు స్థావరంగా మారింది. ప్రజలకు మాత్రం అసౌకర్యం తప్ప మరేం మిగలడం లేదు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టణ ప్రజలు మాట్లాడుతూ పార్కు శుభ్రత, భద్రత, మరుగుదొడ్ల సదుపాయాలపై మున్సిపల్ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ విషయంపై సంబంధిత మున్సిపల్ అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.