15 రోజులకోసారి వస్త.. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్త : సీఎం చంద్రబాబు…
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకొనే ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. 15రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని, అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు.మాజీ మంత్రి బాబూమోహన్ టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ అక్కడ కూడా ఇమడలేక పోయారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబూమోహన్ తాజాగా చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది.