భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశం

వరద నష్టపరిహారంపై యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయమన్న సూచన

పోచారం డ్యామ్ మరమ్మత్తులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశం

అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 4

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

“ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి. విపత్తు సమయంలో పాలన యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి” అని సీఎం సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చూపుతున్న చొరవను అభినందించిన ఆయన, నష్టపరిహారంపై యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

పంటల నష్టం, గృహ నష్టం, రహదారుల దెబ్బతినడం, మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధించి శాస్త్రీయంగా అంచనాలు వేసి, పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే పోచారం డ్యామ్ మరమ్మత్తులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు, పునరావాసం వంటి మౌలిక అవసరాలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఇంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం ముందు వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, కాటిపల్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment