*ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత అటు నుంచి అటే..*
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బుధవారం జరిగే ఏఐసీసీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లారు. రేపు, ఎల్లుండి రెండ్రోజులపాటు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా సైతం ఇప్పటికే చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాగా, రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు సైతం ఢిల్లీకి వెళ్లారు.
ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు సైతం ఉండున్నారు. అనంతరం ఈనెల 16న రాత్రి అటు నుంచి అటే సింగపూర్‌కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం నాడు బిజినెస్ మీట్‌లో పాల్గొంటారు.
పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీకి సంబంధించి సింగపూర్‌లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్శిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. జనవరి 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు..