జిల్లా అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
వర్షం ఉధృతి ముందు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):
జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల అనంతరం వివిధ శాఖలు చేపట్టిన పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. శానిటేషన్ కార్యక్రమాలను పగద్భందీగా నిర్వహించడంతోపాటు, గురుకుల విద్యాలయాలు సహా అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు.
ప్రతిరోజూ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు అందించాలని సూచించిన కలెక్టర్, రేపటి నుండి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులకు ఎలాంటి సెలవులు లేవని, అందరూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్, ఆర్డీఓ వీణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.