వరి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
వర్షాలు వచ్చే అవకాశంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం )అక్టోబర్ 28
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదాశివనగర్ మండల కేంద్రం, రాంరెడ్డి మండలం పరిధిలోని ఉప్పల్ వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, కొనుగోలు ప్రక్రియపై అధికారులు, సంఘ కార్యదర్శులు, సెంటర్ ఇంచార్జీలతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, తేమ నియంత్రణ చర్యలు, ధాన్యం రక్షణకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వడ్ల కాంటాలను పరిశీలించిన ఆయన, వాతావరణం బాగాలేని కారణంగా తడవకుండా సంరక్షించుకోవాలని సూచించారు. మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, రసీదు జారీకి ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాలు, 233 ప్యాక్స్, 193 ఐకెపీలు ఉన్నాయని, గ్రేడ్-A రకానికి క్వింటాలుకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లింపులు జరగనున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీలో డిప్యూటీ కలెక్టర్ రవితేజ, DRO మదన్ మోహన్, DCO రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్, DM, DCSO, AO, AEOలు, సంఘ కార్యదర్శులు పాల్గొన్నారు.