అన్నారం గ్రామ పంచాయితీలో నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు
కామారెడ్డి జిల్లా, ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28:
రామారెడ్డి మండలం అన్నారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణను ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—
జిల్లాలో మూడు విడతలలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, నామినేషన్ కేంద్రం వద్ద గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. నామినేషన్ సమర్పించడానికి వచ్చే అభ్యర్థులు, ప్రతిపాదకులను మాత్రమే అనుమతించాలని, నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు వంటి కీలక దశల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఉమాలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.