Site icon PRASHNA AYUDHAM

భూభారతి: రైతులకు భరోసా – కలెక్టర్ గౌతమ్

IMG 20250423 WA2512

*భూభారతి: రైతులకు భరోసా – కలెక్టర్ గౌతమ్*

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 23

, రైతుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. మేడిపల్లి మండలంలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా రైతులు తమకు తెలియకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆర్డీవోలకు తగిన అధికారాలు కల్పించామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా వారి సమస్యలన్నింటినీ ఈ చట్టం ద్వారా పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

భూ సంబంధిత వివాదాలు కూడా భూభారతిలో పరిష్కరించబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. భూ సరిహద్దులు పారదర్శకంగా ఉండేందుకు బుధార్ విధానం ప్రవేశపెట్టామని, రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ఒకేసారి చేసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వివరించారు. వారసత్వ బదిలీ మరియు విభజన ప్రక్రియలు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సమస్యపై రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఈ చట్టంలో ఉందని కలెక్టర్ రైతులకు తెలియజేశారు.

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టంతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ప్రభుత్వం అనేక కొత్త అంశాలతో ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తీసుకువచ్చిందని, ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని, రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ద్వారా రైతులకు న్యాయమైన పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూముల రికార్డుల వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Exit mobile version