*భూభారతితో రైతులకు నష్టం లేదు: కలెక్టర్ గౌతం*
* భూమి కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్‌లో మార్పులు
* ధరణి సమస్యలకు భూభారతిలో పరిష్కారం
* ప్రతి సంవత్సరం భూముల రికార్డుల వివరాలు గ్రామ పంచాయతీలో ప్రదర్శన
* భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం – అదనపు కలెక్టర్
ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఎలాంటి నష్టం కాని కష్టం కాని కల్పించే దిశగా చర్యలు తీసుకోదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం స్పష్టం చేశారు. భూభారతి చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సందేహాలుంటే రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
మంగళవారం శామీర్‌పేట మండలంలోని తూంకుంటలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. భూమి కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్ సమయంలో లైసెన్స్డ్ సర్వేయర్లతో చేయించిన మ్యాప్‌లను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ పత్రాల్లో చేరుస్తామని తెలిపారు. దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, భూ సరిహద్దులు మరింత పకడ్బందీగా ఉంటాయని ఆయన అన్నారు. రైతు అంగీకరిస్తేనే భూ సర్వే చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ధరణి వల్ల ఉన్న పిఒబి సమస్యలకు భూభారతి చట్టంలో పరిష్కారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూముల రికార్డుల్లో జరిగే మార్పులను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారని, దీనివల్ల ప్రజలకు తమ భూముల వివరాలు తెలుస్తాయని ఆయన వివరించారు. చిన్న సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ అధికారులను నియమిస్తామని, భూ వివాదాలుంటే తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంతో రెవెన్యూ అధికారుల బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కొత్త అంశాలతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థ అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆయన అన్నారు.
కీసర ఆర్డిఓ మాట్లాడుతూ 1989 ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలు, భూభారతిలోని అంశాలు ఒకేలా ఉన్నాయని, రెవెన్యూ అధికారులకు ధరణిలో లేని అధికారాలు భూభారతిలో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.