ఫీల్డ్ లో ఉన్న జర్నలిస్టులకు ఆక్రిడిటేషన్ కార్డులు అందించాలని కలెక్టర్ కు వినతి
ప్రశ్నాయుధం న్యూస్, ఆగస్టు 13, కామారెడ్డి :
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డి. ఎల్. యన్. చారి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణమే బలమైన ప్రజాస్వామ్యానికి నాంది అని అన్నారు. జర్నలిస్టుల నైతిక విలువలు ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తికరించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని అలాంటి వాతావరణం మీడియా ద్వారానే సాధ్యమని అన్నారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే మీడియా వాతావరణం పారదర్శకంగా స్వేచ్ఛగా ఉండాలని తెలిపారు. జర్నలిస్టుల ఆత్మగౌరవమైన అక్రిడిటేషన్ కార్డు జారీలో చాలా అవకతవకలు జరిగాయని అన్నారు. ఫీల్డ్ లో ఉండి వార్తలు రాసే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రీడిటేషన్ కార్డు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. వెల్ నెస్ సెంటర్లలో మందుల కొరత తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టు మిత్రులందరికీ పోరాడే సమయం ఆసన్నమైందని, జర్నలిస్టు సమస్యలపై పోరాడడానికి టీజేఎస్ ఎస్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రధాన కార్యదర్శి సితార్ల సురేష్, కోశాధికారి తమ్మల పాండు, నూతన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.