కలెక్టర్ హెచ్చరిక లెక్కచేయని హోదాదారాలు – ప్రజా కోపం తట్టుకోలేరు..!!
ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి
ప్రజావాణి — అధికారుల నిర్లక్ష్యానికి అద్దం
కలెక్టర్ ఆదేశాలు విస్మరించిన జిల్లా అధికారులు
గైర్హాజరు, గేమ్స్, లంచ్ లేటు ప్రజల నమ్మకానికి గండం
ప్రజావాణి — ప్రజల కేకలు వినని చెవులకు హెచ్చరిక
ప్రశ్న ఆయుధం ఆగష్టు 11నిజామాబాదు..
ప్రజావాణి… పేరు వినగానే ప్రజలు ఆశతో, సూదురా ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారు. సమస్యలు చెబితే తక్షణ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉంటుంది. కానీ నిజామాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ నమ్మకాన్ని ఒక్కో రోజూ పగలగొడుతున్నాయి. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, కొంతమంది జిల్లా అధికారులు మాత్రం తమ “రాజసం” వదలలేకపోతున్నారు.
కలెక్టర్ ఆదేశం ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 వరకు జిల్లా అధికారులు స్వయంగా ప్రజావాణిలో ఉండాలి. కానీ వాస్తవం? — కొంతమంది రాలేదు, కొంతమంది బదులుగా కిందిస్థాయి సిబ్బందిని పంపారు, మరికొందరు 2 గంటలకు లంచ్‌కి వెళ్లి 4.30కి కటకట లాంటి ముఖాలతో వచ్చారు. ఇంకొంతమంది అక్కడే కూర్చొని సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడటం… ఇది పరిపాలనా సమావేశమా లేక గేమింగ్ జోన్‌నా..?
ప్రజావాణి అనేది ప్రజల హక్కు, అధికారుల కర్తవ్యం. అది “ఐచ్చికం” కాదు. ఈ వేదికలో ప్రజల సమస్యలు వినకుండా, ఆ సమస్య పరిష్కరించగల వ్యక్తి గైర్హాజరైతే, అది నేరం లాంటిదే. ప్రజల సమయాన్ని, కష్టపడి వచ్చిన వారిని ఇలా నిర్లక్ష్యం చేయడం పరిపాలనకు అవమానం.
కలెక్టర్ సూచన స్పష్టం అత్యవసరమైన పని ఉంటే ముందుగానే చెప్పాలి, లేకుంటే గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవు. కానీ ఈ హెచ్చరికను కొందరు అధికారులు చెవిలో వేసుకున్న కాటన్ బంతిలా పట్టించుకోవడం లేదు.
ఇది ఇక్కడితో ఆగకూడదు.
ప్రజావాణికి గైర్హాజరు అయిన అధికారుల పేర్లు బహిరంగంగా ప్రకటించాలి.
క్రమశిక్షణ చర్యలు వెంటనే ప్రారంభించాలి.
“జిల్లా అధికారి” అనిపించుకోవాలంటే ముందుగా “ప్రజా సేవకుడు”గా ప్రవర్తించాలి.
ప్రజావాణి ఒక నాటకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి నాడి. ఆ నాడి కత్తిరించే నిర్లక్ష్యం చేసినవారు, పదవులు, హోదాలు ఏమైనా కావచ్చు, ప్రజల కోపం నుండి తప్పించుకోలేరు.
ప్రజావాణి కేవలం మంగళవారం పేపర్‌లో వచ్చిన ఫోటో కోసం కూర్చోనే వేదిక కాదు. ఇది ప్రజల న్యాయం కోసం పోరాట వేదిక. ఆ వేదికను సీరియస్‌గా తీసుకోని అధికారులు, తమ కుర్చీలు సురక్షితమని అనుకోవడం మూర్ఖత్వం.
ప్రజలు ఒక్కసారిగా “ప్రజావాణి” నుంచి “ప్రజావిక్షణ” మోడ్‌లోకి మారితే, ఆఫీసు గదుల గోడలు కూడా వారి నిరసనతో దద్దరిల్లుతాయి.