ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్

*ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్*

నిజామాబాద్, డిసెంబర్ 12 : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా, నివేశన స్థలానికి సంబంధించి ఏమైనా ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేయించారు. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇప్పటివరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి, వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే, అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపర్చాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా లబ్ది చేకూరేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహశీల్దార్ గజానంద్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment