ములకలపల్లి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన..

సమీకృత వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యం

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ములకలపల్లి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన..

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు . మంగళవారం ఆయన ములకలపల్లి మండలంలోని పలు గ్రామాలను విస్తృతంగా పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా రాజుపేట గ్రామంలో చింతకాయల నాగేశ్వరరావు,కుమారి దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టల యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు.మండల సమైక్య సహాయంతో రుణం పొందిన రైతు,కౌజు పిట్టలతో పాటు నాటు కోళ్లు మరియు మేకల పెంపకం చేపడుతున్నట్టు కలెక్టర్‌కు వివరించారు. రైతు తెలిపిన ప్రకారం,300 కౌజు పిట్టల పెంపకం చేపట్టామని ఇప్పుడు పంట చేతికి వచ్చిందని దీని ద్వారా నెలకు సుమారు 15,000 ఆదాయం పొందుతామని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,రానున్న సంవత్సరంలో జిల్లాలో 500 చేపల పెంపక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని,చేపల పెంపకంతోపాటు అదే ప్రాంగణంలో కౌజు పిట్టలు, నాటు కోళ్లు, మేకల పెంపకం వంటి సమీకృత వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా చేపల పంట చేతికి వచ్చేంతవరకు రైతులు నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ ఆదాయాన్ని రైతులు చేపల పెంపకానికి తీసుకున్న రుణాలకు ఈఎంఐగా చెల్లించడం ద్వారా ఆర్థికభారం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే, రైతు పామాయిల్ సాగులో అంతర్పంటగా మునగ సాగు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.తదుపరి పూసగూడెం గ్రామంలోని డంపింగ్ షెడ్లో గ్రామపంచాయతీ వర్కర్లు తయారు చేస్తున్న బయోచార్ (జీవ బొగ్గు) తయారీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎండిన చెట్ల కొమ్మలు, తుమ్మ వంటి పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి మంట ద్వారా బయోచార్ తయారుచేసే విధానాన్ని సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ,ఈ విధంగా తయారైన బయోచార్‌ను గోమూత్రం మరియు గోవుపేడలో కొన్ని రోజులు నానబెట్టి ఆరబెట్టి పొడిచేసి పంటలకు సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం మెరుగుపడి అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. గ్రామపంచాయతీలు చెత్త సేకరణ సమయంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఆయన ఆదేశించారు. డంపింగ్ యార్డుల్లో తయారైన కూరగాయ వ్యర్థాల కంపోస్ట్ ఎరువును కూడా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ పాతగంగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణవాటికను సందర్శించారు.అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించి,వారికి అందిస్తున్న ఆహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణవాటిక ఏర్పాటు చేసి, పిల్లలు, గర్భిణీలు,బాలింతలకు సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు,కూరగాయలు ఉచితంగా అందిస్తున్నారని సిబ్బంది వివరించారు.

కేంద్రంలో పెంచిన ఆరు రకాల ఆకుకూరలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆకుకూరలు ఒకేసారి కాకుండా వారానికోసారి మారుస్తూ అందుబాటులో ఉంచాలని సూచించారు. మునగ, వెలగా, చింత, ఉసిరి, కరివేపాకు వంటి మొక్కలను కూడా పెంచాలని సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ,గర్భిణీల కోసం ప్రత్యేకంగా పోషకవాటికలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి సమృద్ధమైన పోషకాహారం అందించవచ్చని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన,తాసిల్దార్ గన్యా నాయక్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment