మురికివాడల అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి – పక్కా ఇళ్లకు చర్యలు, ఆక్రమణల నివారణకు కఠిన ఆదేశాలు

*మురికివాడల అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి – పక్కా ఇళ్లకు చర్యలు, ఆక్రమణల నివారణకు కఠిన ఆదేశాలు*

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 23

జిల్లాలోని మురికివాడలను గుర్తించి అక్కడి నివాసితులకు ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడంపై తహసీల్దార్లు చొరవ చూపాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌధరి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని, భూదాన్ భూముల పూర్తి జాబితాను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సమర్పించాలని ఆదేశించారు. మురికివాడల నివాసితులకు జీ+3, జీ+4 భవనాల్లో నివాసాల ఏర్పాటుకు అవగాహన కల్పించి, వారి అంగీకారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గతంలో కేటాయించిన ఇళ్లలో వేరే వ్యక్తులు ఉంటున్నారా, అద్దెకు ఇచ్చారా అనే అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని కోరారు.వర్షాకాల దృష్ట్యా, జిల్లాలోని వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్యాధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద ఇప్పటికే కేటాయించిన ఇళ్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల సమస్యను తొలగించాలని, కొత్త మున్సిపాలిటీలకు అవసరమైన ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డీఆర్‌ఓ హరిప్రియ, ఆర్డీవోలు ఉపేందర్ రెడ్డి, శ్యామ్ ప్రకాష్, లా ఆఫీసర్ చంద్రవతి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment