*మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ ఆసుపత్రుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు – వైద్య సేవలపై సమీక్ష*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 23
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌధరి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి ఈరోజు మల్కాజ్‌గిరి ఏరియా ఆసుపత్రి మరియు కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, మందుల సరఫరా తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ మను చౌధరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధుల చికిత్స విభాగం, జిల్లా క్యాన్సర్ సెంటర్, శిశువైద్య విభాగం, ఔట్‌పేషెంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. చిన్నారులకు అందుతున్న వైద్యం, ప్రసవాల సంఖ్య, శస్త్రచికిత్సల వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు.అలాగే, ఆసుపత్రి ఫార్మసీలో మందుల నిల్వలపై, వాటి సరఫరా మరియు ఈ-ఔషధి పోర్టల్ పనితీరుపై సమీక్ష జరిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల పంపిణీ, ల్యాబ్ సదుపాయాలు, క్షయవ్యాధి రోగులకు అందుతున్న చికిత్సపై కూడా అధికారులతో చర్చించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై వెంటనే నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ శోభారాజ్, ఇతర వైద్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.