అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలపై కలెక్టర్ హెచ్చరిక
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంటలను రక్షించుకోవాలని సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం)నవంబర్ 1
ఇటీవలి రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటల నష్టం నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కూరగాయలు, పూలు, మామిడి, అరటి, మిరప, టమోటా వంటి పంటల రైతులు పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పరచి వెంటనే నీరు బయటకు వెళ్లేలా చూడాలని ఆయన సూచించారు. వర్షం తగ్గిన తర్వాత తడి నేలపై యంత్రసామగ్రి వినియోగం నివారించాలన్నారు.
పంటల వారీగా సూచనలు ఇస్తూ కలెక్టర్, అరటి పంటలకు మద్దతులు ఇవ్వాలని, మామిడి పండ్ల కుళ్లు నివారించేందుకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ పిచికారీ చేయాలని తెలిపారు. టమోటా, మిరప పంటల్లో ఫంగల్ వ్యాధులు కనిపిస్తే మాన్కోజెబ్ లేదా కాపర్ మందులు వాడాలని సూచించారు. కూరగాయల పంటల్లో నీరు నిల్వ లేకుండా చూసి, 13-0-45 మరియు 19-19-19 ద్రావణాలను పిచికారీ చేయాలని తెలిపారు.
బాక్టీరియా ఆకు మచ్చ, బూడిద బూజు, కాయ తొలుచు పురుగుల నివారణకు సూచించిన మందులను వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని సూచించారు. పంట నష్టం గమనించిన రైతులు వెంటనే స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.