నకిలీ రుణ యాప్‌లకు బలౌతున్న సామాన్యలు
– : రాష్ట్రంలో నకిలీ లోన్ యాప్‌లకు బలైపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. బ్యాంకుల్లో రుణాలు పొందడంలో ఇబ్బందులు పడలేక..సులభంగా మంజూరు అవుతున్నాయనే భ్రమలో అనేక మంది సామాన్యులు ఈ లోన్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన మోసాలపై 2019 నుంచి 2024 అక్టోబరు వరకు 199 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే నకిలీ యాప్‌ల వల్ల మోసపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని, కానీ అవగాహన లేకపోవడం వల్ల ఫిర్యాదు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. వడ్డీల మీద వడ్డీలు బాదడం కాకుండా..బెదిరింపులు, కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరక పోస్టులతో వేధింపులు, భౌతిక దాడులతో ఈ యాప్ కంపెనీల రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. 2019-2023 మధ్యకాలంలో ఈ రుణాల యాప్‌లకు వివిధ రూపాల్లో 201 మంది బాధితులుండగా..ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 11 మంది బాధితులుండగా..ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలాంటి దారుణాలకు సంబంధించి 2019 నుంచి 2024 అక్టోబరు వరకు 199 కేసులను పోలీస్‌లు నమోదు చేశారు. 146 మందిపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 456 నకిలీ యాప్‌లు ప్రజలను మోసగిస్తున్నాయని గుర్తించి, వాటిలో ఇప్పటి వరకు 229 యాప్‌లను బ్లాక్ చేయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మనీ రికవరీ ఏజెంట్ల నుంచి ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేసేందుకు 1138 మొబైల్ నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడివారిపై ఫిర్యాదుల కోసం జాతీయ స్థాయిలో 1930 నంబరు అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు నకిలీ రుణ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని, రిజర్వుబ్యాంకు నియంత్రణంలోని పనిచేస్తున్న సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలని అధికారులు సూచించారు.