పినపాక నియోజకవర్గంలోని పలు ఆదివాసి, గిరిజన గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే రక్షిత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఐ.ఎఫ్.టి.యు. ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పరిశుభ్రత లేని నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐ.ఎఫ్.టి.యు. ఆధ్వర్యంలో మంగళవారం నాడు పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లును, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో బి. రాహుల్ (ఐఏఎస్)ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అనేక ఆదివాసి గ్రామాల్లో రక్షిత త్రాగునీటి సౌకర్యం లేదని, ప్రజలు చెలిమలు, చెరువులు, కుంటలలోని అపరిశుభ్రమైన నీటిని తాగుతున్నారని తెలిపారు.
మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని పెద్దిపల్లి, విప్పలగుంపు, బుడుగుల, సర్వాయి గుంపు, రేగుల గండి, కుమ్మరి గుంపు, మనుబోతుల గూడెం, పిట్టతోగు వంటి గ్రామాలలో శాశ్వత తాగునీటి పథకాలు ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, మణుగూరు రైల్వే స్టేషన్ నుండి రాయన్నపేట వరకు రహదారి నిర్మాణానికి ఐటీడీఏ నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, వాటిని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఆదివాసి గ్రామాలకు విద్యుత్, రహదారి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ పంచాయతీ పరిధిలోని చింతలక్ష్మీనగర్ గ్రామానికి తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని కూడా వినతిలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు బి. జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, అంగోత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.











