సమానత్వం, సత్యం, సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ మహాత్మా బసవేశ్వరుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మియాపూర్ ఎం.ఏ నగర్ బస్తీలో బసవేశ్వర జయంతి వేడుకల్లో ఆయన ఈ పిలుపునిచ్చారు.
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ బస్తీలో నిర్వహించిన వేడుకల్లో వి. జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బసవేశ్వరుడు కేవలం మతపరమైన గురువు మాత్రమే కాకుండా గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవిగా భారత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని తెలిపారు. 12వ శతాబ్దంలో జీవించిన ఆయన సమాజంలో నెలకొన్న అన్యాయాలు, కులవ్యవస్థ, అసమానతలపై నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.
బసవేశ్వరుడి బోధనలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, సమానత్వం–సేవ–సత్యం అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలువలను అనుసరించడం ద్వారా సముజ్వల సమాజ నిర్మాణానికి దోహదపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మన్నేపల్లి సాంబశివ రావు, రాంచందర్ గౌడ్, కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, రవి కుమార్ గౌడ్, రాంబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.







