హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ ఐక్యత, సాంస్కృతిక చైతన్యం లక్ష్యంగా ఎల్లారెడ్డిలో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ముత్యపు రాఘవులు–పెంటయ్య ఫంక్షన్ హాల్లో జరగనుంది.
నిర్వాహకుల వివరాల ప్రకారం, భారతదేశ ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజమని, హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి, సమైక్యపరిచి దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామీజీల సందేశాలు, ప్రముఖ వక్తల ప్రసంగాలు ఉంటాయి. దేశం, ధర్మం, హిందూ జీవన విధానం ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
యజ్ఞంతో కార్యక్రమం ప్రారంభమై, హనుమాన్ చాలీసా పారాయణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కుల, వృత్తి, పార్టీ, మత భేదాలకు అతీతంగా హిందూ బంధువులందరూ సకుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ సమ్మేళనం ద్వారా హిందూ ఐక్యత, శక్తి, సంస్కృతి పట్ల నిబద్ధతను చాటాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.












