కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. వేసవి జాగ్రత్తలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు సూచనలు అందించారు.
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశాల మేరకు, పోలీసు కళాబృందం బస్టాండ్ ఆవరణలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలపై అప్రమత్తత వంటి అంశాలపై దృష్టి సారించారు.
సైబర్ నేరాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1930 ను సంప్రదించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో 100 నంబర్ కు కాల్ చేయాలని, మహిళల భద్రత కోసం షి టీమ్స్ (నం:972686094) అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు తమ మాటలు, పాటల ద్వారా ఈ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో భరోసా ఇంచార్జి కవిత మరియు టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాణిస్తున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











