కరీంనగర్ నగరంలో నివాసముంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు చోట్ల కర్మకాండ నిలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిలయాలు అంత్యక్రియల అనంతరం ఆశ్రయం కల్పించడంతో పాటు, కనీస వసతులను అందించనున్నాయి.
అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలలో ఎవరైనా మరణించినప్పుడు, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు ఈ కర్మకాండ నిలయాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. సొంత ఇల్లు లేని వారికి, బంధువుల ఇళ్లలో ఉండలేని వారికి ఇది ఒక గొప్ప ఉపశమనం కానుంది.
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు నగరంలోని పలు స్మశాన వాటికల సమీపంలో నిర్మాణానికి అనువైన స్థలాలను ఇప్పటికే పరిశీలించారు. ఈ స్థలాలలో జీ+1 పద్ధతిలో భవనాలు నిర్మించి, కర్మకాండ నిలయాలుగా తీర్చిదిద్దనున్నారు.
ప్రతి కర్మకాండ నిలయం నిర్మాణానికి సుమారు రూ.50 లక్షల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు, బస చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయిన నాటి నుండి కర్మకాండలు ముగిసే వరకు గరిష్టంగా 13 రోజులపాటు ఆశ్రయం పొందే వెసులుబాటు ఉంటుంది.
ఈ నిలయాలలో బస చేయడానికి నామమాత్రపు రుసుము వసూలు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే పాలకవర్గం నిర్ణయం తీసుకోనుంది. మేయర్ మాట్లాడుతూ, స్థలాల ఎంపిక పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు.









