కూకట్పల్లి ఈనాడు కాలనీలోని లిటిల్ విల్లే ప్రీ స్కూల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల చిన్నారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుని వేషధారణలో వచ్చి అందరినీ ముగ్ధులను చేశారు. చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు రామాయణంలోని ఘట్టాలను ప్రదర్శించడంతో పాటు, భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేసి సందడి చేశారు.
వేడుకల అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు శ్రీరామనవమి ప్రత్యేక పానకం, వడపప్పు ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ, పండుగలు మన జీవనశైలిలో భాగమని, చిన్నతనం నుంచే పిల్లలకు మన పురాణాల గురించి, రాముని ఆదర్శాల గురించి తెలియజేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.










