బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని కామారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, మధు మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని బసవేశ్వరునికి నివాళులర్పించారు.
కామారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని సోమవారం ఐడిఓసీ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, మధు మోహన్ పాల్గొని మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త అని, కులవ్యవస్థ, లింగ వివక్షత, మూఢనమ్మకాలపై పోరాడుతూ సమానత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేశారని తెలిపారు. ‘అనుభవ మంటపం’ ద్వారా ఆయన సమాజంలో సత్యం, సమానత్వం, శ్రమ గౌరవం వంటి విలువలను ప్రాచుర్యంలోకి తెచ్చారని వివరించారు.
‘కాయకమే కైలాసం’ అనే బసవేశ్వరుని సందేశం నేటి సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు, లింగాయత్ సమాజ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.








