కామారెడ్డి జిల్లాలో రంజాన్ పండుగను పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య శాంతియుతంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నమాజ్ నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేయబడింది. ముఖ్యంగా మసీదులు, ఈద్గాహ్ల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రార్థనల సమయంలో, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈద్ వేడుకలను పురస్కరించుకుని ఎస్పీ బందోబస్తును స్వయంగా పరిశీలించి, పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి రంజాన్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. పోలీసుల అప్రమత్త చర్యలతో కామారెడ్డి జిల్లాలో ఈద్ పండుగ ప్రశాంతంగా, సజావుగా ముగిసింది.












