రంజాన్ మాసం పవిత్రతను, సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పే 'దవాత్-ఏ-ఇఫ్తార్' కార్యక్రమం కూకట్పల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసి చైర్మన్ గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని గాంధీ ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని, ఇది తెలంగాణకు ప్రత్యేకమైన 'గంగా జమునా తెహజీబ్'ను మరింత పరిఢవిల్లేలా చేస్తుందని, పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని పిఎసి చైర్మన్ గాంధీ అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసం ద్వారా మంచి తనం, సంస్కారం అలవడతాయని, ఇది మత సామరస్యానికి ప్రతీక అని, అందరూ కలిసి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని గాంధీ తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలు పండుగను లోటు లేకుండా, సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులు, ఈదుగాల అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించామని, పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కుల, మత, జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటేనని, దేవుడి కృప పొందడానికి భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేస్తారని ఆయన వివరించారు. ఆధ్యాత్మిక, దైవ ప్రార్థనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.










