సాఫ్ట్వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి తన కుమారుడు మహాన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో 48వ సారి రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు ఆయనను అభినందించారు.
సదాశివ నగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డి, నిస్వార్థ సేవా దృక్పథంతో క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడంతో పాటు, యువతలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇటీవల ఆయన ఒక రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. కామారెడ్డి రక్తదాతల సమూహం పిలుపుమేరకు, తన కుమారుడి మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని 48వ సారి రక్తదానం చేసి, తన సేవా నిబద్ధతను మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, సంతోష్ రెడ్డి సేవలను ప్రశంసించారు. ఆయన రక్తదానం పట్ల యువతలో స్ఫూర్తిని నింపుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.
సంతోష్ రెడ్డి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.












