శేర్లింగంపల్లి నియోజకవర్గం, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని స్వర్ణపురి కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో హెచ్ఎమ్టీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్జీఓ కమ్యూనిటీ, సీజీఐ కంపెనీ ప్రతినిధులు మద్దతు అందించారు.
స్వర్ణపురి కాలనీలోని పార్క్-3, స్ట్రీట్-27లో జరిగిన ఈ కార్యక్రమంలో, హెచ్ఎమ్టీ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు జి.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ, ఇది కాలనీలో చేపట్టిన రెండవ తోటల పెంపకం కార్యక్రమమని తెలిపారు. గతంలో జనవరి 23న పార్క్-4, స్ట్రీట్-24లో ఎన్జీఓ కమ్యూనిటీ, టాటా ఎలెక్సి సహకారంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించామని, ఇప్పటివరకు హెల్పింగ్ హ్యాండ్స్ బృందం నాలుగు పార్కులను అభివృద్ధి చేసిందని, కాలనీని మరింత పచ్చగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల హెచ్ఎమ్టీ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం అమీన్పూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్‌ను కలిసి, హెచ్ఎమ్టీ బీ జోన్లో డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణంపై ఒక ప్రాతినిధ్య పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. జీహెచ్ఎమ్సీ నుంచి సానుకూల స్పందన లభించిందని, పార్కుల నిర్వహణ ఛార్జీల అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని, ఏఈ, డీఈలతో పాటు డిప్యూటీ కమిషనర్ తనిఖీ కోసం వేచి చూస్తున్నామని వివరించారు.
అలాగే, డివైడర్లకు నలుపు-పసుపు రంగులతో పెయింటింగ్ చేయాలని కోరుతూ లింగంపల్లి జోనల్ కమిషనర్‌కు కూడా ఒక ప్రాతినిధ్య పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ కాలనీ అభివృద్ధికి, పచ్చదనానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సీజీఐ సంస్థకు చెందిన సుమారు 50 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే సుమారు 300 పూల మొక్కలను నాటి, కాలనీలో పచ్చదనాన్ని పెంచే దిశగా గణనీయమైన ముందడుగు వేశారు. కార్యక్రమంలో హెచ్ఎమ్టీ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.











