కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి, రాజయ్య అనే వృద్ధ దంపతులు నివాసానికి సరైన ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ తాటిపత్రి కింద జీవనం గడుపుతున్న వీరు, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తలదాచుకోవడానికి కనీసం ఒక చిన్న గూడు కూడా లేని ఆ వృద్ధ దంపతులు, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారు ఉంటున్నది ఇల్లు కాదు, మూడు కర్రల మధ్యన కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి. గాలికి ఎగిరిపోయే ఆ తాత్కాలిక ఆశ్రయం కిందే వారి జీవితం సాగుతోంది. పేదరికం, వృద్ధాప్యపు రోగాలు వారిని నిత్యం వెంటాడుతున్నాయి.
వీరికి తోడుగా ఉన్న మనవరాలి బాధ్యత కూడా వీరిపైనే ఉంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనమే వీరి ఆకలిని తీరుస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఆ బడి ఆవరణను ఊడుస్తూ, కూలి పనులు చేసే ఓపిక లేక జీవనం గడుపుతున్నారు.
సొంతంగా ఒక చిన్న గూడు కట్టుకోవాలనే ఆశతో ఉన్నప్పటికీ, అందుకు అవసరమైన ఆర్థిక స్థోమత వారికి లేదు. ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే, వచ్చే డబ్బులతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఒక గది అయినా కట్టించి ఇస్తారనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడి ప్రశాంతంగా జీవించాలని వారు కోరుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరాలని, ముఖ్యంగా ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అండగా నిలవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, తక్షణమే వారికి ఇల్లు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












